గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎన్నడూ చూడని విపత్తును చూసింది రాయలసీమ. చిత్తూరు తల్లడిల్లిపోయింది. అనంతపురం జిల్లా అల్లాడిపోయింది. కడప కకావికలమయ్యింది. వాటితో పాటుగా నెల్లూరు కూడా వణికిపోయింది.
వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలకు తోడు డ్యాముల నిర్వహణలో వైఫల్యం సీమ జిల్లాలకు కష్టాలు తెచ్చాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. అనూహ్య వర్షాలే ఇంత పెద్ద నష్టానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది. సహజంగా రాయలసీమలో వర్షాభావం సమస్య ఉంటుంది. కానీ గడిచిన కొన్నేళ్లుగా సీమలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతోంది. అయినా చిత్తూరు జిల్లాలో లోటు వర్షపాతమే కనిపించేది.
కానీ ఈసారి దానికి పూర్తి భిన్నంగా ఏకంగా 10 రోజుల పాటు వర్షాలు కురిశాయి. అందులోనూ నవంబర్ 16న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో కుండపోతగా వర్షాలు కురిశాయి. తిరుమలలో రికార్డు స్థాయిలో 20 సెంటిమీటర్ల వర్షం పడిందని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. గడిచిన ఆరు దశాబ్దాల్లో అంతటి వర్షాలు చూడలేదని టీటీడీ ఈవో వెల్లడించారు.
18వ తేదీ నాటికి తిరుపతితో పాటుగా చిత్తూరు జిల్లాలో వరదలు వచ్చాయి. చిత్తూరుతో పాటుగా ఎగువన తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పెన్నా నదికి ఉన్న ఉపనదులన్నీ ఉప్పొంగాయి. పాపాఘ్ని, బహుదా, మాండవ్య, పింఛా, చెయ్యేరు, సోమశిల ఇలా నదులన్నీ ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహించాయి. ఆనకట్టలు పొంగిపొర్లాయి. అన్నీ కలిసి పెన్నా నదిని ఊహించని వరదతో ముంచెత్తాయి.