”సౌదీ అరేబియా దేశం ఒకే జమాత్ మార్గంలో నడుస్తోంది. ఒకే జమాత్, ఒకే మతం అనే విశ్వాసం నుంచి ప్రజల్ని విడగొట్టడానికి బయట నుంచి వచ్చిన వేరే జమాత్‌లు ప్రయత్నించాయి. దీనిద్వారా సౌదీ ప్రజల ఐక్యతను విడగొట్టాలని చూశాయి. అలాంటి వాటిలో ఒకటి తబ్లీగీ జమాత్. ఇది సౌదీ అరేబియా దేశానికి తమను తాము మిత్రులం (అహ్‌బాబ్) అని చెప్పుకుంటుంది.”

”దీని మూలాలు భారతదేశ ఉపఖండంలో ఉన్నాయి. ఇస్లాం అనుసరించే అనేక నియమాలకు విరుద్ధంగా తబ్లీగీ జమాత్ వ్యవహరిస్తుంది. ఇది ఆహ్వానం లేకుండానే విందులకు వెళ్తుంది. ఈ జమాత్‌లోనే తీవ్రవాద గ్రూపులు కూడా పుట్టుకొచ్చాయి. దీన్ని అనుసరించేవారు బాధితులుగా మారతారు.”

”సౌదీ అరేబియా జైళ్లలో ఉన్న తీవ్రవాద గ్రూపులకు చెందిన వారిని విచారించగా, వారు గతంలో తబ్లీగీ జమాత్‌తో కలిసి పనిచేసినట్లుగా తెలిసింది. తబ్లీగీ జమాత్‌తో సంబంధాలు నెరపడం చట్టబద్ధం కాదని సౌదీ అరేబియా ఫత్వా కమిటీ నిర్ణయించింది.”

”తబ్లీగీ ఆహ్వానాన్నివ్యతిరేకించడం తప్పనిసరి. ఇలాంటి గ్రూపులు మన ఐక్యతను ముక్కలు చేస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఆహ్వానాన్ని మన్నించకూడదు” అని శుక్రవారం సౌదీలోని జామా మసీదులో ఖుత్బా (ప్రబోధం)ను వెలువరించారు. సౌదీ అరేబియాలోని మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచనల మేరకు దాదాపు అన్ని జామా మసీదుల్లో ఇలాంటి ప్రబోధాలు ఇచ్చారు.