Home News పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా

పుష్ప: తగ్గేదే లే.. అంటూ బాలీవుడ్‌కు పోటీ ఇస్తున్న దక్షిణాది సినిమా

53
0

ఒకప్పుడు హిందీ వాళ్లకి ‘మద్రాసు సినిమాలు’ అంటే రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి నటించినవి మాత్రమే. కొంతవరకు నాగార్జున, వెంకటేశ్ కూడా పరిచయమే. నేడు ఉత్తర భారతదేశంలోని పల్లెటూళ్లల్లో కూడా ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి దక్షిణాది హీరోల పేర్లు మారుమోగిపోతున్నాయి.

ధనుష్, అజిత్, విజయ్ దేవరకొండ, చియాన్ విక్రమ్, కిచ్చా సుదీప్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య, సమంత, రష్మిక మందన్న.. ఇలా ఎవరి పేరు చెప్పినా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, బెంగాల్ నుంచి మధ్యప్రదేశ్, గుజరాత్ వరకు అందరూ గుర్తుపడతారు. వాళ్ల సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతున్నాయి.

హిందీ చిత్రసీమలో దక్షిణాది హీరోయిన్ల హవా వైజయంతీ మాల కాలం నుంచీ మొదలైంది. హేమామాలిని, జయప్రద, శ్రీదేవి, మీనాక్షి శేషాద్రి నుంచి నేడు శృతిహాసన్ వరకు బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగినవారే. వాళ్లంతా హిందీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నవారు. కానీ, ఇప్పుడు సీను మారిపోయింది. దక్షిణాది తారలు తమ సొంత చిత్రాలతోనే బాలీవుడ్‌లో మెరుపులు మెరిపిస్తున్నారు.

పూర్తి వినోదాత్మక చిత్రాలు, ప్రేక్షకుల నాడి పట్టుకోగలగడం, అన్నింటికన్నా ముఖ్యంగా గత 20 ఏళ్ల నుంచీ ఆలోచన, ముందుచూపుతో అమలుచేస్తున్న వ్యూహాలు ఈరోజు బాలీవుడ్‌కు సవాలు విసురుతున్నాయి. పూర్వం అశ్వమేధయాగం చేసిన తరువాత రాజులు తమ యాగాశ్వాన్ని విడిచిపెట్టేవారు. ఆ గుర్రం ఆగిన చోట, యుద్ధానికి కాలుదువ్వి ఆ ప్రాంతాన్ని కైసవం చేసుకునేవారు.

అదే తరహాలో, బాలీవుడ్ కోటను స్వాధీనం చేసుకునేందుకు దక్షిణాది చిత్రాలు తమ అశ్వమేధయాగపు గుర్రాన్ని పరిగెత్తిస్తున్నాయి. దక్షిణ భారత సినీ సైన్యం బాలీవుడ్‌ను పాలించాలనే కలను సాకారం చేసుకోవడానికి అతిసమీపంలో ఉంది. అయితే ఇదంతా పుష్ప సాధించిన విజయం వల్లే అనుకుంటే పొరపాటే.