Home News Adipurush: ప్రభాస్‌ సినిమాకు పెరుగుతున్న కష్టాలు.. ఆదిపురుష్‌ను అక్కడ రిలీజ్‌ కానివ్వమని బీజేపీ నేత హెచ్చరిక

Adipurush: ప్రభాస్‌ సినిమాకు పెరుగుతున్న కష్టాలు.. ఆదిపురుష్‌ను అక్కడ రిలీజ్‌ కానివ్వమని బీజేపీ నేత హెచ్చరిక

తాజాగా మరో బీజేపీ నాయకుడు రామ్‌ కదమ్‌ ఆదిపురుష్‌ చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో విడుదల కానివ్వమంటూ ఆయన హెచ్చరించారు.

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ఆదిపురుష్‌ వివాదం ముదిరి పాకాన పడుతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాపై రోజురోజుకీ వ్యతిరేకత తీవ్రమవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌పై సాధారణ ప్రజలు, అభిమానులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని తప్పుగా చూపిస్తున్నారంటూ..

రాముడు, రావణుడు, హనుమంతుడు పాత్రలను వక్రీకరిస్తున్నారంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మరో బీజేపీ నాయకుడు రామ్‌ కదమ్‌ ఆదిపురుష్‌ చిత్రబృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో విడుదల కానివ్వమంటూ ఆయన హెచ్చరించారు. ‘ఆదిపురుష్‌ సినిమాను మహారాష్ట్రలో రిలీజ్‌ కానివ్వం. పబ్లిసిటీ, డబ్బు సంపాదించడం కోసం కొందరు నిర్మాతలకు వాస్తవాలను వక్రీకరించడం అలవాటుగా మారింది.

కానీ హిందూ సమాజం ఇలాంటి వాటిని సహించదు. ఆది పురుష్‌ కూడా ఈ కోవకే వస్తుంది. తమ చౌక ప్రచారం కోసం మరోసారి మా హిందూ దేవుళ్లు, దేవతలను ఈ చిత్రంలో కించపరిచారు. కోట్లాది మంది హిందువుల విశ్వాసాలను, మనోభావాలను గాయపరిచారు. ఎప్పటిలాగే క్షమాపణలు చెప్పడం, సదరు సీన్లను కత్తిరించడం చేస్తే సరిపోదు. మరోసారి ఇలాంటి ఆలోచన రాకుండా ఈ సినిమాతో పాటు నిర్మాతలపై నిషేధం విధించాలి’ అని రామ్‌ కదమ్‌ డిమాండ్‌ చేశారు.

కాగా ఈ సినిమాలో సీతగా కృతి సనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌ నటించారు. సోనాల్‌ చౌహాన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇటీవల విడుదలైన టీజర్‌ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. అదే సమయంలో రావణుడు, హనుమంతుడు పాత్రలు, వేషధారణలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు ఈచిత్రంలో వీఎఫ్‌ఎక్స్‌ విజువల్స్‌ అసలు బాగోలేవని, ఓ యానిమేటెడ్‌ చిత్రం చూస్తున్నట్టుగా ఉందంటూ కొందరు ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే టీజర్ ఫస్ట్ లుక్ పోస్టర్.. కొన్ని సన్నివేశాలు కాపీ చేయబడ్డాయని విమర్శలు వస్తున్నాయి.