బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి…

బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 1000 కోట్లకుపైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. అల్లూరి, కొమురం భీమ్‌ల ఫిక్షన్‌ కథతో వచ్చిన ఈ చిత్రం భాష, ప్రాంతాలకు అతీతంగా సంచలనం సృష్టించింది. కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇతర దేశాల్లోనూ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది.

సినిమా విడుదలై సుమారు 7 నెలలు గడుస్తోన్నా ఈ సినిమా రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా అరుదైన ఘనత దక్కిన విషయం తెలిసిందే. అమెరికాలో హాలీవుడ్‌ చిత్రాలకు ఇచ్చే శాటర్న్‌ అవార్డు ఈ ఏడాది ట్రిపులార్‌కు చిత్రానికి వరించింది. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఇదిలా ఉంటే ట్రిపులార్‌ను జపాన్‌లో కూడా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా తెలుగు నేలపై పురుడు పోసుకున్న ట్రిపులార్‌ ప్రపంచాన్ని చుట్టేయడంతో తెలుగు సినిమా రేంజ్‌ మరోసారి ప్రపంచానికి తెలిసింది.

ఇక ట్రిపులార్‌కు ఈ స్థాయిలో అంతర్జాతీయంగా గుర్తింపురావడంలో దర్శకుడు రాజమౌళి ఇటీవల స్పందించారు. ఈ విషయమై జక్కన్న మాట్లాడుతూ..’ట్రిపులార్‌ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడం నన్ను ఆశ్చర్యపరిచింది. సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలు అన్ని భాషల ప్రేక్షకులకు కనెక్ట్‌ కావడానికి ఉపయోగపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు. అలాగే ఇండియన్స్‌ ఎక్కడ ఉన్నా అక్కడ సినిమాలు బాగా ఆడుతాయని నేను అనుకున్నాను. కానీ ఇతర దేశాలకు చెందిన ప్రేక్షకుల నుంచి ఆదారణ రావడం ప్రారంభమైంది. దీనిని నేను అస్సలు ఊహించలేదు’ అని చెప్పుకొచ్చారు.